Tummala Nageswara Rao Political Journey : ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, రాష్ట్ర స్థాయిలోనూ చక్రం తిప్పిన నేతల్లో తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఒకరు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంతో పాటు జిల్లా అభివృద్ధి మాంత్రికుడిగా ఆయన బలమైన ముద్ర వేశారు. మూడు వేరు వేరు పార్టీల నుంచి తుమ్మల గెలవడం విశేషం. 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో, 2009, 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఎనిమిది సార్లు బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలుపొందారు. 1983, 1989లో తుమ్మల ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో (నేటి టీఆర్ఎస్) చేరిన తుమ్మల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణించడంతో జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఆయన అదే పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి :ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు. డిగ్రీలో బీకామ్ పూర్తి చేశారు.ఎన్టీఆర్ పిలుపు మేరకు 1978లో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983 ఎన్నికల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్ హాయాంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఓటమి పాలైన తుమ్మల, 1994 ఎన్నికల్లో మరోసారి సత్తుపల్లి నుంచి విజయ బావుటా ఎగురవేశారు.
రెండోసారి చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. 1996 అగస్ట్ 20న చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 1996 డిసెంబర్‌లో భారీ నీటి పారుదల శాఖ బాధ్యతలు తీసుకున్నారు. 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. 2004 ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైన తుమ్మల, అదే సంవత్సరంలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు - సీఎం తొలి సంతకం దానిపైనే!
రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా :సత్తుపల్లి నుంచి ఆరుసార్లు పోటీచేసినతుమ్మల నాగేశ్వరరావు, మూడు సార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓడిపోయారు. అనంతరం 2014లో కేసీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 5న బీఆర్ఎస్‌లో (టీఆర్ఎస్) చేరారు. 2014 డిసెంబర్ 16న కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా అవకాశం అందుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. .
Tummala Nageswara Rao Political Profile : 2015లో ఎమ్మెల్సీగా తుమ్మల నాగేశ్వరరావు చేశారు. 2016లో పాలేరుకు ఉపఎన్నిక రాగా అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేశారు. ఇలా ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరటంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది.
2018లో జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడంతో రాజకీయంగా తుమ్మల మౌనంగా ఉండిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో కొన్ని పరిణామాల వల్ల ఆయన కలత చెందారు. ఈ క్రమంలోనే తుమ్మలను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికే కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించారు.