MLC elections Results 2021: ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస విజయం - trs wins
09:28 December 14
ఖమ్మం, నల్గొండ, మెదక్ ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస విజయం
TRS won Khammam, Nalgonda and medak in MLC elections 2021 : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే తెరాస మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఖమ్మం, మెదక్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాత మధు గెలుపొందారు. ఖమ్మంలో తెరాస 480, కాంగ్రెస్ 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 12. మెదక్, నల్గొండలోనూ తెరాస గెలుపొందింది. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించగా.. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. తెరాస 917, స్వతంత్రులు నగేశ్ 226, లక్ష్మయ్య 26 ఓట్లు వచ్చాయి. స్వతంత్రులు వెంకటేశ్వర్లు 6, రామ్‌సింగ్ 5 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 50.
MLC elections Results 2021: మొత్తం 12 స్థానాలకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా.. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగు నిర్వహించారు. ఈ క్రమంలో నేడు లెక్కింపు చేపట్టారు. జిల్లాకో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓట్లు లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో లెక్కింపు కొనసాగింది.
కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు తొమ్మిది, ఆదిలాబాద్‌లో ఆరు, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అయిదేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. మొదటి ప్రాధాన్యతా ఓటును ముందుగా లెక్కించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.