ఖమ్మం జిల్లా ఏన్కూరులో సహకార ఎన్నికలకు తెరాస నుంచి పోటాపోటీగా నామపత్రాలు దాఖలయ్యాయి. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆశావహులను నేతలు బుజ్జగిస్తున్నారు. రెండ్రోజులుగా తెరాసలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా... కొంత మంది అభ్యర్థులు ఉప సంహరణకు ససేమిరా అన్నారు. చర్చలు ఫలించి కొన్ని వార్డులు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల పోటీ నెలకొననుంది.
తెరాస నేతల బుజ్జగింపులు... ససేమిరా అంటున్న రెబల్స్
సహకార ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. తెరాస నుంచి పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేయగా... ఆశావహుల చేత నామినేషన్ ఉపసంహరింపజేయడానికి నేతలు ఆపసోపాలు పడుతున్నారు.
జూలూరుపాడు మండలంలో ఉప సంహరణ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా కొనసాగింది. వైరా మండలంలో వైరా సంఘంలో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పూసలపాడులో 11 ఏకగ్రీవం కాగా మరో రెండు ఎన్నికలకు దిగనున్నాయి. కొణిజర్ల మండలంలో ఒక వార్డు ఏకగ్రీవం అయింది.
కొన్ని ప్రాంతాల నుంచి తెరాసలో రెండు వర్గాలకు చెందిన నేతలు పోటీ పడుతుండగా ఇతర పార్టీలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏన్కూరులో తెరాస నాయకుల చర్చలు ఫలించకపోవడం వల్ల ఎక్కువ మంది రెబల్స్ బరిలో దిగుతున్నారు.