తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా కార్పొరేటర్లలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ - Election of mayor and deputy mayor Friday

ఖమ్మం కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకొనేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఆ వెంటనే మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక చేపట్టనున్నారు.

trs Intense competition for khammam mayor seat, khammam mayor city seat
మహిళా కార్పొరేటర్లలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ

By

Published : May 6, 2021, 2:27 PM IST

బల్దియాపై రెండోసారి గులాబీ జెండా ఎగరేసిన తెరాస.. మేయర్‌ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న అంశంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. మేయర్‌ పదవి ఈసారి జనరల్‌ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీ నుంచి గెలిచిన మహిళా కార్పొరేటర్లందరూ అర్హులే కావటంతో తీవ్ర పోటీ నెలకొంది. ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రాతినిథ్యం పెరగటంతో కార్పొరేషన్‌ను నడిపించే సామర్థ్యం కలిగిన బలమైన అభ్యర్థికి పీఠం కట్టబెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకోసం సామాజిక వర్గాల వారీగా మేయర్‌ అభ్యర్థిత్వాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఓసీ సామాజిక వర్గానికి మేయర్‌ పీఠం దక్కుతుందని కొందరు.. బీసీలనే పదవి వరిస్తుందని మరికొందరు ఇలా ఎవరికి వారే ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. తెరాస వర్గాలు మాత్రం సీఎం కేసీఆర్‌ పంపే సీల్డ్‌ కవర్‌లోనే మేయర్‌ అభ్యర్థి పేరు ఉంటుందని చెబుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నిక ప్రక్రియ పరిశీలన కోసం అధిష్ఠానం ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. వీరిద్దరూ గురువారం ఖమ్మం రానున్నారు.
అందరూ అర్హులే..
కార్పొరేషన్‌లో తెరాస 43 డివిజన్లలో విజయఢంకా మోగించింది. గెలిచిన వారిలో అత్యధికంగా 30 మంది మహిళలే ఉన్నారు. వీరిలో ఓసీలు-11, బీసీలు-11 మంది ఉన్నారు. ముస్లిం మైనారిటీలు-3, ఎస్సీలు-4, ఎస్టీ-1 ఉన్నారు. వీరిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీనియర్‌ కార్పొరేటర్లుగా ఉన్న వారితోపాటు ఒకటి, రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన వారు ఈ పదవిని ఆశిస్తున్నారు. కొత్తగా ఈసారి బల్దియాలో అడుగుపెట్టబోతున్న వారు సైతం పోటీ పడుతుండటం గమనార్హం. మేయర్‌ పీఠం ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చే పక్షంలో డిప్యూటీ మేయర్‌ బీసీలకు దక్కే అవకాశం ఉంది. ముస్లింలకు డిప్యూటీ మేయర్‌ ఇచ్చే అవకాశంపైనా పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
మంత్రి ఆశీస్సులు ఎవరికో..
మేయర్‌ పీఠం కోసం ఆశావహులు పైరవీలు చేస్తున్నా.. తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానానిదేనన్న సంకేతాలు జిల్లా తెరాస నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆశీస్సులు ఉన్న పలువురి పేర్ల జాబితాను రాజధానికి పంపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయ్యిందన్న ప్రచారం సాగుతోంది. జాబితాలో ఉన్న వారిలో ఎవరి వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుతుందన్న అంశంపై గురువారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మేయర్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా, అసంతృప్తులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details