ఖమ్మం బల్దియా పోరుకు తెరాస కసరత్తు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నగారా దగ్గర పడుతుందంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న వేళ.. అధికార తెరాస ఎన్నికల కసరత్తును మరింత వేగవంతం చేస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ లో ఆశించిన ఫలితాలు లేక కాసింత నిరుత్సాహంలో ఉన్న పార్టీ శ్రేణులపై ఆ ప్రభావం లేకుండా ముందు జాగ్రత్తగా ఎన్నికల పోరుకు సర్వ సన్నద్ధమవుతోంది.
జోష్ నింపిన కేటీఆర్
ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన ఉత్సాహంతోనే.. ఖమ్మం నగరపాలక ఎన్నికల క్షేత్రానికీ గులాబీ దండు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతలను డివిజన్ల వారీగా సిట్టింగ్ కార్పొరేటర్లకు అప్పగించిన తెరాస.. బల్దియా పోరుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా సమాయత్తమవుతోంది.
కసరత్తు మొదలు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం నగరపాలక సంస్థ కు జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఓ వైపు..డివిజన్ల పెంపు ఖాయమైన నేపథ్యంలో అధికార యంత్రాంగం 50 డివిజన్లను 60 గా పునర్విభజించేందుకు కసరత్తుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు మంత్రి పువ్వాడ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని ఎన్నికల క్షేత్రం వైపు నడిపించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
మంత్రి పువ్వాడ దిశానిర్దేశం
2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస.. బల్దియా పై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్ 3, సీపీఎం-2, సీపీఐ-2, తెదేపా-1 చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పటికే నేతల జాబితాను సిద్ధం చేసి.. ఒక్కో నేతకు 5 డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగిస్తోంది. తెరాస జిల్లా కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని శనివారం మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై.. పువ్వాడ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఉద్వాసన తప్పదా..
సిట్టింగ్ కార్పొరేటర్లలో కొంతమందికి ఉద్వాసన తప్పదంటూ ఖమ్మం తెరాసలో జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.... మంత్రి వ్యాఖ్యలు సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.