ఖమ్మం మిర్చి మార్కెట్‌కు మిర్చి రాక ఊపందుకోవడంతో వ్యాపారుల మాయాజాలం జోరందుకుంది. మార్కెట్‌కు ఎక్కువగా మిర్చిరాని రోజుల్లో అధిక ధరలు పెట్టి.. తీరా భారీగా బస్తాలు వచ్చేసరికి దోపిడీ మొదలుపెడుతున్నారు. వారం రోజులుగా ఖమ్మం మార్కెట్‌లో ధరల దగాతో మిర్చి రైతు చిత్తవుతున్నాడు.
సీజన్ మొదటి నుంచి మిర్చితో ఖమ్మం మార్కెట్ కళకళలాడుతోంది. రోజుకు 20 నుంచి 30 వేల బస్తాలకు తగ్గకుండా రైతులు అమ్మకానికి తెస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచే కాకుండా వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు సహా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు మిర్చిని తీసుకువస్తున్నారు. అలా మార్కెట్‌కు మిర్చి పోటెత్తడం.. వ్యాపారులకు వరంగా మారుతోంది. సరకు తక్కువగా వచ్చిన రోజు అధిక ధరలకు కొంటున్నట్లు మభ్యపెడుతున్న వ్యాపారులు.. తీరా ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం సిండికేట్‌గా మారి ధర తగ్గించేస్తున్నారు.
కర్షకుల నిరసన..
సోమవారం సైతం మిర్చి రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. సీజన్‌లో ఎప్పుడూ లేనంతగా ఒక్క రోజే దాదాపు లక్షా 10 వేల బస్తాల సరకు మార్కెట్‌కు వచ్చింది. అంతకుముందు రెండు రోజులు మార్కెట్‌కు సెలవుతో.. సోమవారం భారీగా వచ్చింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు... తమదైన శైలిలో కొనుగోళ్లు సాగించారు. జెండాపాట క్వింటా మిర్చికి గరిష్ఠంగా 14,700గా నిర్ణయించారు. తీరా కొనుగోళ్లకు వచ్చేసరికి మాత్రం రైతులకు రూ.11 వేల 400 కు మించి దక్కలేదు. నాణ్యత లేదని, తేమ ఉందంటూ సాకులు చెప్పి ఇష్టారీతిన కొనుగోళ్లు చేపట్టారు. వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్షకులు మార్కెట్‌లో నిరసన చేపట్టారు. న్యాయం చేయాలని కార్యదర్శి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వ్యాపారులు, పోలీసులు వచ్చి వారిని సముదాయించారు. మూడు నాలుగు రోజుల క్రితం వరకు దాదాపు రూ.16 వేల వరకు ధర పలికిన క్వింటా మిర్చి.. భారీగా రావడం వల్లే పూర్తిగా తగ్గించారని రైతులు వాపోతున్నారు.
మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలంపై ఇప్పటికైనా మార్కెట్ అధికారులు, పాలకవర్గం దృష్టిపెట్టి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జెండా పాట సక్రమంగా అమలయ్యేలా చూడటంతోపాటు సరైన గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
నేటి నుంచే ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం