Thummala MLA Ticket Issue : పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మలకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభిమాన సంద్రం పోటెత్తింది. తుమ్మలకు మేమున్నామంటూ అభిమానులు, కార్యకర్తలు కొండంత అండగా నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల శుక్రవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా తుమ్మలకు మద్దతుగా భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించి అభిమాన నేతకు, అభివృద్ధి ప్రదాతకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు.
Ex Minister Thummala Huge Rally in Khammam: జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అనుచరులు.. తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. నాయకన్ గూడెం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల పాటు వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారంభం నుంచి ఖమ్మం గొల్లగూడెంలోని తన నివాసం వరకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రదర్శనగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు దాదాపు 6 గంటల పాటు భారీ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ ఫొటోలు లేకుండానే ర్యాలీ సాగింది. కొన్నిచోట్ల కార్యకర్తలు తుమ్మల జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు పట్టుకోవడంతో కార్యకర్తలు చర్చించుకున్నారు.
Thummala Comments on Assembly Elections 2023 : నా ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల
ప్రజల కోసం పోటికి వస్తా: భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి తుమ్మల మాట్లాడుతూ.. రాజకీయాలు అవసరం లేదని తాను అనుకున్నానని కానీ.. ప్రజల కోసం కచ్చితంగా రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతానని.. ఈ విషయంలో తగ్గేదే లే అని ప్రకటించారు. తాను రాజకీయంగా ఎన్నోసార్లు కిందపడ్డా.. జిల్లా ప్రజలు మళ్లీ నిలబెట్టారని గుర్తుచేసుకున్న తుమ్మల.. మళ్లీ జిల్లా ప్రజలు, కార్యకర్తల గౌరవం, ప్రతిష్ట, ఆత్మగౌరవం పెంచేందుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఎక్కడా తలవంచే ప్రసక్తే లేదని తెలిపారు.