దాతల సాయం... కాపాడును పసిప్రాణం రెండో పుట్టిన రోజు వేడుకను పూర్తి చేసుకుని... తుళ్లుతూ మూడో ఏడులో అడుగుపెట్టిన చిన్నారిని సంతోషంగా బడికి సాగనంపింది ఆ తల్లి. కనీసం పదిరోజులైనా పాఠశాలకు వెళ్లకుండానే పాప ఓ రోజు హఠాత్తుగా కళ్లుతిరిగి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులకు చేదు వార్త చెవినపడింది. తమ పాప ఎముక మజ్జ(బోన్‌మ్యారో)లో సమస్య ఉందని తెలిసి ఆ అమ్మానాన్న కన్నీరుమున్నీరయ్యారు.
30 లక్షలు కావాలి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన జానీ సాహెబ్, సలీమాలకు ఇద్దరు కూతుళ్లు. చిన్నపాప హాజీరా తస్యూమ్. ఇటీవలే రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఆ బుజ్జాయికి బోన్ మ్యారో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి ఎముక మజ్జ మార్పిడి చేయాలని తేల్చారు. ఇందుకోసం దాదాపు 25 నుంచి 30లక్షలు ఖర్చవుతుందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కూలీ బతుకులకు అంతపెద్ద మొత్తం ఎక్కడి నుంచి సమకూర్చాలో అర్థం గాక దాతల సాయం కోరుతున్నారు.
శస్త్రచికిత్స చేయాల్సిందే...
హాజీరాకు ప్రతినెలా రక్తమార్పిడి చేయాల్సిందే. లేకపోతే.. శరీరం అంతా మచ్చలు ఏర్పడి, విపరీతమైన వాంతులు, జ్వరంతో మంచం పడుతుంది. మూడు నెలలుగా తల్లిదండ్రులు తరచూ హాజీరాకు నీలోఫర్ ఆస్పత్రిలో రక్తం ఎక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా చిన్నారికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పగా.. మజ్జదానం చేయటం కోసం హాజీరా అక్క, తల్లిదండ్రుల నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు.
ఓ ప్రాణదాతా...
మరోవైపు శస్త్రచికిత్సకు కావాల్సిన పెద్దమొత్తం తమ వద్ద లేదని... తమ చిన్నారిని కాపాడుకునేందుకు దాతల సాయం ఒక్కటే మార్గమని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. చివరికి తమకు రేషన్ కార్డు సైతం లేదని... మనసున్న మారాజులు తమ బిడ్డకు ప్రాణంపోయాలని ప్రార్థిస్తున్నారు.
మంత్రి భరోసా...
చిన్నారి పరిస్థితిని తెలియజేస్తూ.. సలీమా తమ్ముడు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో సందేశం పంపారు. స్పందించిన మంత్రి తగిన పత్రాలతో తమ కార్యాలయంలో కలవాలన్నారని సూచించారు. మరింత మంది దాతలు ముందుకు వస్తే తమ బుజ్జాయిని కాపాడుకుంటామని ఆ కన్నపేగు వేడుకుంటోంది.