ఈనెల 25న కొత్త సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత సినిమాల విడుదల కొనసాగే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నాటికి ఒక్కొక్కటిగా థియేటర్లు తెరుచుకోనున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు విడుదల అయ్యేందుకు వీలుంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు చరవాణిలు, టీవీలతో కాలక్షేపం, వినోదం పొందిన ప్రజలు ఆశించిన మజాను పొందలేకపోయారు. ఓటీటీల్లో పెద్దా, చిన్న నూతన సినిమాలు విడుదలైనప్పటికీ థియేటర్లలో వచ్చే వినోదాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం అవుతున్నారు. నూతన సినిమాలతో పాటు ఇప్పటికే పలు వేదికల్లో విడుదలైన వాటిని కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అవకాశం ఉంది.
రాయితీలతో ఉపశమనం
లాక్‌డౌన్‌తో మూతబడిన థియేటర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. ప్రతి నెలా వచ్చే విద్యుత్తు బిల్లులో రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు డిమాండ్‌కు తగినట్లు ప్రదర్శనలు, టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నిర్వహణ ఖర్చులో కొంత వెసులుబాటు కలగనుంది. లాక్‌డౌన్ నుంచి నెలకు రూ.5 లక్షల చొప్పున నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల కొత్త సినిమాల విడుదల కొనసాగనున్న నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గనుందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు.
కొవిడ్ నిబంధనలు
సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం థియేటర్ అంతటా శానిటైజేషన్ చేయడం, 50 శాతం ప్రేక్షకులను అనుమతించడం, థియేటర్ సిబ్బంది, విక్రయ కేంద్రాల్లో పని చేసేవారితో పాటు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలనే నిబంధనలను ప్రభుత్వం విధించింది. వీటన్నింటినీ పాటిస్తూ చలన చిత్రాల ప్రదర్శనకు థియేటర్లను సిద్ధం చేసేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.
సినిమా థియేటర్లు
- ఉమ్మడి జిల్లా: 42
- కొత్తగూడెం, పాల్వంచ: 18
- ఖమ్మం నగరం: 7
పది నెలల ‘ముగింపు’ కథ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 19 నుంచి థియేటర్లలో చలన చిత్రాల ప్రదర్శనలు నిలిపివేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. లాక్‌డౌన్ అనంతర పరిణామాల నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ప్రారంభమైనప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేకపోయాయి. పది నెలల నిరీక్షణ తర్వాత నవంబరు 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చలన చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించుకోవచ్చునని ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినీ ప్రేక్షకుల్లో నూతన ఉత్సాహం వెల్లువెత్తింది.
సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి