తెలంగాణ

telangana

ETV Bharat / state

సార్వత్రిక విద్యా విధానం.. ఉన్నత చదువుల స్వప్నం సాకారం - తెలంగాణ వార్తలు 2021

దూరమైన విద్య చేరువ అవుతోంది. ఉన్నత చదువుల స్వప్నాన్ని సాకారం చేస్తోంది. అదే సార్వత్రిక విద్య. పాఠశాలకు వెళ్లి చదువుకోలేని, ఆర్థిక కారణాల వల్ల విద్యనభ్యసించలేని, ఉద్యోగాలు చేస్తూ ఉన్నత విద్యనభ్యసించాలనుకొనే వారికోసం అందించే గొప్ప లక్ష్యంతో ఏర్పాటైంది ఓపెన్‌ స్కూల్‌(సార్వత్రిక) విధానం. సార్వత్రిక పది, ఇంటర్‌లకు దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఈనేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన అభ్యసన కేంద్రాలు, గత మూడేళ్లలో ఉత్తీర్ణత శాతం వివరాలతో ‘ఈటీవీభారత్’ కథనం.

open schools in khammam district
సార్వత్రిక విద్యా విధానంతో ఉన్నత చదువుల స్వప్నం సాకారం

By

Published : Jan 5, 2021, 11:31 AM IST

బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతరులకు విద్యనందించటమే సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ముఖ్య ఉద్దేశం. ఈ విధానంలో అనేక మంది పది, ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ, పీజీ కూడా పూర్తి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. ‘అందరికీ విద్య, అందుబాటులో విద్య’ సూత్రాన్ని అనుసరిస్తూ అభ్యాసకులకు అభ్యసనంలో పూర్తి స్వేచ్ఛనిస్తోంది. అభ్యాసకుని నిత్య జీవితానికి ఉపయోగపడేలా కాలానుగుణమైన విద్యా విషయక, వృత్తి సంబంధమైన కోర్సులను అభ్యసించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఉన్నత చదువులకు, వృత్తి విద్యా కోర్సులకు వెళ్లే అర్హత కూడా ప్రభుత్వం కల్పించింది.

113 అధ్యయన కేంద్రాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదో తరగతికి మొత్తం 56, ఇంటర్మీడియట్‌కు 57 అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అధ్యయన కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి పరిశీలిస్తే సార్వత్రిక పది, ఇంటర్‌ పరీక్షలను ఎంతో పటిష్టంగా నిర్వహిస్తోంది. అభ్యాసకులు తప్పనిసరిగా తరగతులకు హాజరై, బాగా చదువుకుని రాసిన వారు మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు.

ఇవీ..అర్హతలు..

పదో తరగతిలో చేరేందుకు 2020 నాటికి 14ఏళ్లు, ఇంటర్మీడియట్‌లో చేరేందుకు 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. పదో తరగతికి రాయటం, చదవటం వస్తే చాలు. గతంలో చదవకుంటే తహసీల్దారు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం జత చేయాలి. చదివి ఉంటే గతంలో చదివిన తరగతులకు సంబంధించిన టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ జత చేయాలి. ఇంటర్మీడియట్‌ చదవాలంటే పదో తరగతి తప్పక ఉత్తీర్ణులై ఉండాలి.

సార్వత్రిక విద్య నాకు ఒక వరం

ఖమ్మం లయోలా స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాన్న మరణం, ఆర్థిక సమస్యలు తదితర కారణాల దృష్ట్యా చదువు మధ్యలోనే ఆపేశాను. 2016లో సార్వత్రిక పది, 2017లో సార్వత్రిక ఇంటర్‌ పూర్తి చేశాను. అనంతరం చింతకాని మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రస్తుతం అసిస్టెంట్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇటీవలే డిగ్రీ కూడా పూర్తి చేశాను. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాను.

పానెం సాయి వినయ్‌, చింతకాని మండలం

దళారుల మాటలు నమ్మవద్దు

ప్రవేశాలు తీసుకునే అభ్యర్థులు అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలను మాత్రమే సంప్రదించాలి. దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్ధు అభ్యాసకులకు ఇది ఎంతో మంచి అవకాశం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పి.మదన్‌మోహన్‌, డీఈవో, ఖమ్మం

ప్రవేశాలు ప్రారంభం

సార్వత్రిక విద్య పది, ఇంటర్‌కు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు ఇదే సరైన సమయం.

ఎ.మురళీకృష్ణ, తెలంగాణ ఓపెన్‌స్కూల్స్‌, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త

ABOUT THE AUTHOR

...view details