విద్యుత్‌శాఖలో కొలువంటేనే కత్తిమీద సాము లాంటిది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితి. వర్షాకాలంలో కష్టాలు వర్ణనాతీతం. అలాంటి శాఖలో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలందిస్తూ మండల ప్రజల మన్ననలు పొందుతున్నారు ఏఈ రఘోత్తమరెడ్డి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంతోపాటు వైరా పురపాలికలో కొన్ని వార్డులు తన పరిధిలో ఉండటంతో రెండు వైపులా ఉత్తమ సేవలందిస్తూ ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 ఏళ్లు. నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆ మాట మరిచిపోయినట్లు ఇప్పటికీ చేను, చెలకల్లో తిరుగుతూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రగతి ద్వారా పురపాలక గ్రామాల్లో, పల్లె ప్రగతి ద్వారా మండలంలోని గ్రామాల్లో స్తంభాలు ఏర్పాటు, తీగల మరమ్మతులు త్వరితగతిన చేపట్టి జిల్లాలోనే ఉత్తమ ఏఈగా మన్ననలు పొందారు.
ఎల్లకాలం గుర్తుండేలా..
మండలంలో విద్యుత్ సమస్యలపై పట్టున్న రఘోత్తమరెడ్డి వాటి పరిష్కారం దిశగా దశల వారీ చర్యలు చేపట్టారు. ఎక్కువగా సమస్య ఉన్న బస్వాపురం, లింగగూడెం పంచాయతీని దత్తత తీసుకుని కొత్త స్తంభాలు, నియంత్రికలు ఏర్పాటు చేసి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఆ గ్రామం పూర్తిగా వ్యవసాయాధారితం కావడం వల్ల తీగలు కిందకు వేలాడుతూ గడ్డి ట్రాక్టర్లు వచ్చే వీలు లేకపోవడంతో ఉన్నతాధికారులను ఒప్పించి పెద్ద స్తంభాలు ఏర్పాటు చేశారు. తన సేవలకు ఆ గ్రామస్థులు ఎన్నటికీ గుర్తుండే విధంగా పనులు చేశారు. అదే తరహాలో చాలా గ్రామాల్లో సేవలు చేశారు.