కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఉప్పెర్ల రంగయ్య సంతాప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రద్దు చేయాలి:
నూతన వ్యవసాయ చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందుతాయని.. రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని తమ్మినేని ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోల్పోయే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీలు కలిసి రావాలి:
"ఈ నెల 8న చేపట్టనున్న భారత్ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికి విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యల్లో భాగంగా గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా భాజపా పుంజుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా, తెరాసలను ఓడించేందుకు ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలు కలిసి రావాలి."