Godavari Water Level in Badrachalam : భద్రాచలం వద్ద గోదావరికి వరద పెద్దఎత్తున వస్తోంది. ఎగువ గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి భారీగా పోటెత్తిన వరదతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పరివాహకంలో గ్రామాలు ముంపు బారినపడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట బిక్కుబిక్కుమంటున్నారు. రామాలయం పరిసరాలను నీటిప్రవాహం చుట్టుముట్టింది. లోతట్టు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు తగ్గినందున.. రెండ్రోజుల్లో గోదావరి శాంతిస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.
Telangana to Chhattisgarh Traffic Stop: గోదావరి వరద పోటుతో మన్యం ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-చత్తీస్‌గఢ్ మధ్య రెండ్రోజులుగా రవాణా నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ నుంచి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజారవాణా స్తంభించి జనం అవస్థలు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసంచారం లేకుండా పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలో వరద పరిస్థితి సమీక్షించారు. హెలికాఫ్టర్ నుంచి విహంగ వీక్షణం ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని.. బాధితులకు భరోసా ఇచ్చారు.
"ఖమ్మం జిల్లాలో గోదావరి ఉప్పొంగనందున మొత్తం నీటితో నిండిపోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి వరద ముంపు ప్రాంతానికి వెళ్లి దగ్గర ఉండి చూసుకుంటున్నాం. దాదాపు 75 పునరావస కేంద్రాలను సందర్శించాను. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. వీలైనంత వరకు ప్రాణ నష్టం, పంట నష్టం లేకుండా కాపాడం. మరో మూడు రోజుల్లో వరద తగ్గుముఖం అవుతుందని అనుకుంటున్నాం." - పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి