రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో జలాశయాలు నిండుతున్నాయి. దాదాపు అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. కడెం, మిడ్ మానేరు, తాలిపేరు, ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు 35 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.
ఎల్లంపల్లి జలాశయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతంలో ఉన్న కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి 1,90,107 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు 35 గేట్లను ఎత్తి 2,28,690 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. మొదట ఇరవై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ నుంచి వరద నీరు అధికమవడంతో మరో పదిహేను గేట్లను ఎత్తారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల కోసం గోదావరిలోకి రావద్దని సూచించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఇన్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా... 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 1090.40 అడుగులు ఉంది. విద్యుదుత్పత్తి చేస్తూ... 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు వద్దకు మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. కలెక్టర్, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీకి వరద, నీటి విడుదలపై చర్చించారు. లోతట్టు గ్రామాల సర్పంచ్లతో ఫోన్లో మాట్లాడి... అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎగువ మానేరు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావు పేట మండలంలోని నర్మాల వద్ద ఎగువమానేరు జలాశయం వరద నీటితో నిండింది. పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి భారీగా చేరిన వరద నీటితో... జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 31 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎగువమానేరు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అప్రమత్తమైన పోలీసులు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టును సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
మధ్య మానేరు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి... లక్షా 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో... అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.