భారతదేశ వృద్ధిరేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖమ్మం పర్యటనలో భాగంగా.. రూ.30 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ రెండో దశకు మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వర్‌రావుతో కలిసి అంకురార్పణ చేశారు. హైదరాబాద్‌కు మాత్రమే ఐటీని పరిమితం చేయకుండా.. ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి.. టి-ఫైబర్ పూర్తైన తర్వాత ఇంటింటికీ బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.
అనంతరం సీసీరోడ్లతో పాటు శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. తర్వాత టేకులపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 35 వేల నూతన కనెక్షన్లు, 85 వేల పాత కనెక్షన్లకు ప్రతి రోజూ మంచినీటి సరఫరాను మంత్రి ప్రారంభించారు.