గ్రేటర్ హైదరాబాద్ సమరం ముగిసిన వేళ.. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పోరు ముగియడం వల్ల ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. 2019 పురపాలక చట్టం ప్రకారం జరగనున్న ఈ ఎన్నికల ప్రక్రియ త్వరలో ఊపందుకోనుంది.
ఇక 60 డివిజన్లు..
హైదరాబాద్ మినహా మిగతా కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఖమ్మం బల్దియాలో మరో 10 డివిజన్లు పెరగనున్నాయి. ఫలితంగా డివిజన్ల సంఖ్య 60కి చేరనుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రకటనకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికల నగరా మోగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు ఇప్పటికే టికెట్ల ప్రయత్నాలు ప్రారంభించారు. పునర్విభజన పూర్తయిన తర్వాత డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ జరగనుంది. దాదాపు అన్ని డివిజన్లలో ప్రస్తుత రిజర్వేషన్లు మారతున్నాయి. ఫలితంగా సిట్టింగ్ కార్పొరేటర్లకు సీటు భయం వెంటాడుతోంది. రిజర్వేషన్ మారితే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారపక్షం సహా ఇతర పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతుండటంతో ఖమ్మంలో ఎన్నికల కాక మొదలైంది. మరోసారి పీఠం దక్కించుకునేందుకు అధికార తెరాస వ్యూహాలు రచిస్తుండగా... సత్తా చాటాలన్న సంకల్పంతో విపక్షాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఇక ఖమ్మం వంతు.. అధికార విపక్షాల వ్యూహాలు షురూ ఇవీచూడండి:ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!