National Leaders Speech at Khammam Sabha: ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభకు హాజరైన దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్ , యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఇతర జాతీయ నేతలు కేంద్రప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. కేసీఆర్, భగవంత్ సింగ్ మాన్ మినహా మిగిలినవారు కాంగ్రెస్ గురించి ఏమీ ప్రస్తావించకుండా పూర్తిగా భాజపాపైనే విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ తన ప్రసంగంలో ఒకసారి.. కాంగ్రెస్-భాజపా దొందూ దొందే అని పేర్కొనగా, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భాజపా వ్యతిరేక పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దాదాపుగా ఇది కాంగ్రెసేతర విపక్షాల సభగా, దేశంలో మొదటి భారీ కార్యక్రమంగా నిలిచింది. బహిరంగసభలో మొదట మాట్లాడిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ భాజపా వ్యతిరేక పోరాటంలో భావసారూప్యం కలిగిన పార్టీలు ఇలా కలవడం ప్రజల భవిష్యత్తుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
'దేశంలో సమాఖ్య వ్యవస్థను కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. రాజ్యాంగంలో నైతిక విలువలు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి... రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కూలదోస్తోంది. అనైతిక పద్ధతుల్లో ఆయా చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది. మన మాతృభాష.. మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. హిందీ భాషను బలవంతంగా రుద్దడం ద్వారా మన మాతృభాషను దూరం చేస్తోంది. ఇది మన దేశ సమగ్రతకు పెను ముప్పు. చివరకు మన న్యాయవ్యవస్థ స్వతంత్ర్యపైనా దాడి చేస్తోంది.'-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
దేశంలో అన్నివర్గాల ప్రజలను భాజపా వంచించిందని భగవంత్‌మాన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించిన కేజ్రీవాల్... భాజపాపై ఐక్యంగా పోరాటాం చేస్తామని చెప్పారు.
'దేశంలో ధరల పెరుగుదల కారణంగా సామన్యులు కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది. కానీ దేశ ప్రధానమంత్రికి ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఎలాంటి చింతా లేదు. ఆయన ఎప్పుడూ. ఏ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి, ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మాత్రమే ఆలోచిస్తారు. ఈ తరహా వైఖరితో దేశం ముందుకెళ్లదు.ప్రజలు వారికి వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు దేశం మార్పు కోరుకుంటోంది. వీరు దేశాన్ని మార్చడానికి రాలేదని, దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారని ప్రజలకు అర్థమైంది. 2024 ఎన్నికలు ప్రజలకు ఓ మంచి అవకాశం. ప్రజలంతా కలిసి వీరిని గద్దె దించాలి. దేశం గురించి ఆలోచించే వారిని అధికారంలోకి తీసుకురావాలి.'-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి