ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ పోడు భూముల కేసులో అరెస్టైన మహిళలు జైలు నుంచి విడుదలయ్యారు. వారం రోజుల క్రితం అటవీ అధికారులకు, ఆదివాసీలకు మధ్య జరిగిన వివాదంలో... పోలీసులు ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. కోర్టు వీరికి జ్యుడిషియల్ రిమాండ్ విధించగా... తల్లుల వెంట చంటి పిల్లలను సైతం అధికారులు జైలుకు పంపారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా... ఆరు రోజుల పాటు జైలులో ఉన్న... 18 మహిళలు ఇవాళ విడుదలయ్యారు. పసిపిల్లల తల్లులమని కూడా చూడకుండా జైలులో తమను చిత్రహింసలకు గురిచేశారంటూ.... బాధితులు కారాగారం ముందు ఆందోళనకు దిగారు.
'నేను మూడు నెలల బాలింతను. జైలులో బియ్యం ఏరమంటే.. పాపను పక్కకు పెట్టి మరీ ఏరాను. పిల్లలు ఉన్నారని కనికరించకుండా పని చేయించారు. నాకు ఈ సమయంలో ఈ కష్టమెందుకు సార్. పిల్లలకు బాలేదని చెప్పినా... పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. పైగా మేము నాటకాలు ఆడుతున్నామంటూ హేళన చేశారు. మా భూములకు పట్టాలు ఇస్తే చాలు మాకు. ఇంకేమి వద్దు.'
-బాధితురాలు