ఖమ్మం నగరపాలక సంస్థకు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ.. డివిజన్ల పునర్విభజన సిట్టింగ్ కార్పొరేటర్లలో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతమున్న 50 డివిజన్లు 60 డివిజన్లవుతుండటం వల్ల రిజర్వేషన్లు మారే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటి వరకు డివిజన్ ను నమ్ముకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సిట్టింగు కార్పొరేటర్లు రిజర్వేషన్ మారితే ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఎటూ తేల్చుకోలేక
ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. పునర్విభజనలో ప్రస్తుతం వారికి బలమున్న ప్రాంతాలు మరో డివిజన్లోకి వెళ్లే అవకాశం ఉన్నందున ప్రస్తుతం డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా..? లేక రిజర్వేషన్ల అంశం తేలేవరకు వేచి చూడాలా అన్న ప్రశ్నతో సిట్టింగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఖమ్మం గద్దె కోసం తెరాస వ్యూహం
ఖమ్మం నగరపాలక సంస్థలో పాలకవర్గంగా ఉన్న తెరాసలో.. ప్రస్తుత పరిస్థితి సిట్టింగులను కలవరానికి గురిచేస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో కాసింత నిరాశకు లోనైన తెరాస ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సొంత నియోజకవర్గంలో జరిగే ఎన్నిక కావడం వల్ల ఈ పోరు ఆయనకూ కీలకంగా మారింది. గత ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు గెలుచుకుని బల్దియా పీఠం దక్కించుకున్న తెరాస మరోసారి మేయర్ గద్దెపై గులాబీ జెండా ఎగురవేసేందుకు అన్నివిధాలా సన్నద్ధమవుతోంది. మరో 10 డివిజన్లు పెరగనుండటం వల్ల ఆశావహులు వారి ప్రయత్నాలు ప్రారంభించారు.