తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కోటి ఉత్సవాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న భద్రాద్రి.. - Bhadradri is illuminated with electric lights

BHADRADRI VEDUKALU: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి.. ముక్కోటి ఉత్సవాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో రాములోని సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న జగదభిరాముడు.. భక్తలోకాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నాడు. ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సమయం దగ్గరపడుతుండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

BHADRADRI VEDUKALU
భద్రాద్రిలో రామయ్య వేడుకలు

By

Published : Dec 31, 2022, 1:57 PM IST

ముక్కోటి ఉత్సవాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న భద్రాద్రి

BHADRADRI VEDUKALU: భద్రాద్రిలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో మొదటిది సీతారాముల కల్యాణం కాగా.. రెండోది ముక్కోటి వేడుక. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు పేరిట ఈ నెల 23న మొదలైన వేడుకలు... జనవరి 2 వరకు ఆద్యంతం వైభవోపేతంగా జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా సర్వలోకాలను ఏలే జగదభిరాముడు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ... భక్తులను పరవశింపజేస్తున్నారు.

ప్రతిరోజూ ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్ద భక్తులకు దర్సనమిస్తున్నారు. రోజు స్వామి వారికి ధనుర్మాస పూజల్లో భాగంగా బేడా మండపంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఆలయం వద్ద నుంచి పవిత్ర గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి మిథిలా స్టేడియం వద్దకు వెళ్లి.... అక్కడ వేచి ఉన్న భక్తులకు రాముల వారు దర్శనమిస్తున్నారు. ఇప్పటివరకు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నర్సింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారంలో దర్శనమిచ్చిన రాములోరిని దర్శించుకుని భక్తజనం పులకించిపోయింది.

శుక్రవారం బలరామావతారంలో భక్తులకు రాములవారు దర్శనమిచ్చారు. నేడు కృష్టావతారంలో దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జనవరి 1న సాయంత్రం గోదావరి తీరంలో నిర్వహించే తెప్పోత్సవం వేడుకతో పాటు జనవరి 2న తెల్లవారుజామున జరగనున్న ఉత్తరద్వార దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకలను భక్తుల మధ్య వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఈ వేడుకలు తిలకించేందుకు భారీగా తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాధికారులు భద్రాద్రిని అందంగా ముస్తాబు చేశారు. ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు, ఆలయానికి రంగురంగుల విద్యుదీపాలతో తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాలను అందమైన రంగులతో తీర్చిదిద్దారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రంగులు దిద్ది.. చలువ పందిళ్లు, మామిడి తోరణాలు ఏర్పాటు చేశారు.

విద్యుత్ దీపాలంకరణ నడుమ భద్రాద్రి ఆలయం అత్యంత సుందర రమణీయంగా దర్శనమిస్తోంది. ఉత్తర ద్వార దర్శనానికి సెక్టార్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. భద్రాచల ఆలయ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం మిథిలా స్టేడియం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, సురభి నాటకాలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల తర్వాత రాపత్తు సేవలు, విలాస ఉత్సవాలు, విశ్వరూప సేవ జరగనున్నాయి.

"గత మూడు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేపోయాము. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాము. 40 వేల మంది నుంచి 50వేల వరకు రామభక్తులు వస్తారని ఆశిస్తున్నాము. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండ అన్ని ఏర్పాట్లు చేశాము."-శివాజీ, ఆలయ ఈవో

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details