ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి సింగరేణి ఉపరితల గని విస్తరిస్తుంటే.. ఉనికి కోల్పోతున్న బాధిత గ్రామస్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని చేతులు జోడిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ ప్రభావిత గ్రామమైన జగన్నాథపురం వాసుల దీన గాథ ఇది. గ్రామంలో మొత్తం 160 గృహ సముదాయాలున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నుంచే గ్రామం పచ్చని ప్రకృతిని అల్లుకుని ఆదివాసీ కుటుంబాలతో బంధం పెనవేసుకుంది. అక్కడ ప్రతీ ఇంటికీ తాటిచెట్లు దర్శనమిస్తాయి. వేసవికాలం వచ్చిందంటే చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు... ఈ ఆదివాసీ గూడేనికి కల్లు కోసం బారులు తీరేవారు.
బాంధవ్యాలు తెంచుకున్నారు..
ఇలా ఆదివాసీ కుటుంబాల జీవనానికి ప్రతీకగా నిలిచిన జగన్నాథపురంలో... సింగరేణి యాజమాన్యం బొగ్గు గనుల వెలికితీతకు ఐదేళ్ల క్రితం అంకురార్పణ చేసింది. మూడేళ్ల నుంచే గ్రామాన్ని వీడి వెళ్లిపోవాలంటూ సింగరేణి, ప్రభుత్వ అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చారు. 2018 జనవరిలో గ్రామస్థులకు నోటీసులు అందించారు. అనేకసార్లు ఆదివాసీలతో చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసి... వారి డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామన్న హామీ ఇచ్చారు. దీంతో వారు గూడెంతో అనుబంధ బాంధవ్యాలు తెంచుకునేందుకు సిద్ధమయ్యారు.
తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది..
మొత్తం 179 మందికి ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించారు. పరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ.11.64 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. వీటితో పాటు ఆదివాసీలు కోల్పోతున్న భూమికి, ఇళ్లకు ప్రత్యేకంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన వారికి ఈ మేరకు ఇళ్లు, భూమి పరిహారం అందింది. కానీ..అసలు పరిహారం ఇవ్వడంలో తీవ్రమైన జాప్యానికి తోడు... నాడు ఇచ్చిన మాటను మార్చారు. కేవలం రూ.7.61 లక్షలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారు. దీనిపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తొలుత ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.