Singareni Elections Polling 2023 : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు, హైకోర్టు జోక్యంతో ఇవాళ జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదింటి వరకు కొనసాగింది. 5 గంటల తర్వాత వరుసలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మిక ఓటర్లు ఉండగా మొత్తం 94.15 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.
Singareni Election Voting Percentage 2023 :దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్మికులు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. 6 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కోసం 11 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాత్రి వరకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 13కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గెలుపు ధీమాలో ఉన్న ఆయా కార్మిక సంఘాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు రాత్రి వరకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ, ప్రధానంగా సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(AITUC), కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ(INTUC), బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల మధ్యే పోటీ నెలకొంది.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ - బరిలో 13 కార్మిక సంఘాలు
ఇల్లందు సింగరేణి ఏరియాలో ఉన్న 614 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇక్కడ 2,450 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1,2,3లో, 12,824 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే కార్మికులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా కార్మిక సంఘాలు పోలింగ్ కేంద్రాల వెలుపల ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని పనిచేసే యూనియన్నే గెలిపించాలని నాయకులు కార్మికులను కోరారు.