తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతిగృహంలో షార్ట్‌సర్క్యూట్‌.. బాలిక మృతి

ప్రభుత్వ వసతి గృహాల్లో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యానికి ఓచిన్నారి బలైపోయింది. చాలీచాలని వసతి.. సౌకర్యాలలేమి.. పట్టించుకోని అధికారులు.. అన్నీ కలిపి వసతిగృహాన్ని మంటల్లో కాలిబూడిదచేశాయి. ఈప్రమాదం నుంచి దాదాపు 30 మంది వరకు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.

వసతిగృహంలో షార్ట్‌సర్క్యూట్‌.. బాలిక మృతి

By

Published : Jul 15, 2019, 4:55 PM IST

Updated : Jul 15, 2019, 8:04 PM IST


అసలేం జరిగింది...
ఖమ్మం ఎన్నెస్పీ క్యాంపులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి వసతిగృహాన్ని బూడిదచేశాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం కురిసింది. ఓ ట్యూబ్‌లైట్‌లోకి నీళ్లు చేరి ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు చెలరేగి క్షణాల్లోనే అంతటా వ్యాపించాయి. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న చిన్నారులు ప్రమాదం గుర్తించలేకపోయారు. ఊపిరాడక స్పృహకోల్పోయారు. మరికొందరు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు.

వసతిగృహంలో షార్ట్‌సర్క్యూట్‌.. బాలిక మృతి

ప్రాణాలు ఫణంగాపెట్టి కాపాడిన స్థానికులు
మంటల్ని గమనించిన స్థానికులు హుటాహుటిన హాస్టల్‌లోకి వచ్చి పిల్లలందర్నీ బయటకు లాగేశారు. భవనంలో విద్యుత్‌ పూర్తిగా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. ఫలితంగా సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. మంటలు, దట్టమైన పొగతో వసతిగృహం అంతా ఊపిరాడని పరిస్థితి నెలకొంది. పూర్తిగా స్పృహ కోల్పోయిన ఓ బాలికను చివరిక్షణంలో గుర్తించారు. అప్పటికే ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు విడిచింది. చనిపోయిన విద్యార్థినిని నాలుగో తరగతి చదువుతున్న స్పందనగా గుర్తించారు.

నలుగురి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో ఊపిరాడక అస్వస్థతకు గురైన నలుగురు బాలికల్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ఓ విద్యార్థిని చికిత్సపొందుతుండగా.. ముగ్గురు విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ విచారణపై దృష్టిసారించారు. మృతిచెందిన బాలిక కుటుంబానికి 2 లక్షల పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని హామీఇచ్చారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడారు. దురదృష్ట వశాత్తు ఇలాంటి ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతామని వివరించారు.

పెను ప్రమాదం తప్పింది
షార్ట్‌సర్య్కూట్‌ తర్వాత హాస్టల్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్‌లోని బెడ్లు పూర్తిగా కాలిపోయాయి. ఆదివారం ఈ సంఘటన జరగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. 105 మంది బాలికలు ఉండే హాస్టల్‌లో.. ఘటనకు ముందే 70 మంది వరకు తమ సొంత ఇళ్లకు వెళ్లిపోయారు. ఒకవేళ విద్యార్థినులు అందరూ ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది.

నిర్లక్ష్యమే అసలు కారణం
నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హాస్టల్‌ వార్డెన్‌ సైతం రాత్రిపూట ఇంటికి వెళ్లిపోగా.. వాచ్‌మెన్‌ ఒక్కరే ఉన్నాడు. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చూడండి:'పుర పోరు కొత్త షెడ్యూల్​ జారీ

Last Updated : Jul 15, 2019, 8:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details