ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం రైల్వే స్టేషన్లో దుకాణాదారులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన క్యాటరింగ్, టీ స్టాల్స్, నీళ్ల సీసాల విక్రయ దుకాణాలు పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభించినప్పటికీ.. ఖమ్మం జిల్లాలో పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో ఖమ్మం మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లలో పూర్తిగా దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఫలితంగా రైల్వే శాఖ ఆదాయం కోల్పోతుండగా.. దుకాణాదారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం, మధిర, కొత్తగూడెం, మణుగూరు, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాల నిమిత్తం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఏడు క్యాటరింగ్ కేంద్రాలు, టీస్టాల్స్, నాలుగు నీళ్ల సీసాల విక్రయ దుకాణాలను ఏర్పాటు చేశారు. మధిరలో ఒక క్యాటరింగ్, ఒక నీళ్ల సీసాల విక్రయ దుకాణాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్(కొత్తగూడెం)లో ఒక దుకాణం ఉంది. వీటన్నింటిలోనూ ఒక్క ఖమ్మం రైల్వేస్టేషన్‌లో మాత్రమే ప్రయాణికుల సౌకర్యార్థం ఒక దుకాణం తెరిచి ఉంచారు. మిగతా అన్నిచోట్ల దుకాణాలు మూసేసే ఉన్నాయి.