సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు... సీతారామ ఎత్తిపోతల పథకంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలన్న సంకల్పంతో ఉంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 2016లో స్వయంగా సీఎం కేసీఆర్ ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అప్పటి నుంచి సీతారామ ఎత్తిపోతల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలోనే భూసేకరణ, ఆతర్వాత అటవీ, పర్యావరణ అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇలా మూడేళ్లలోనే రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన ఎత్తిపోతల పథకం.. లక్ష్యం దాటినా ఇంకా నత్తనడకనే నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పెరిగిన అంచనా వ్యయం...70 టీఎంసీలు లక్ష్యం
గోదావరిపై దుమ్మగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకుంది. తొలుత ప్రాజెక్టు అంచనా వ్యయం 7926.147 కోట్లు అనుకున్నప్పటికీ... నీటి మళ్లింపు లక్ష్యం 70 టీఎంసీలకు చేరటం వల్ల అంచనా వ్యయం దాదాపు 15 వేల కోట్లకు పెరిగింది. 16 ప్యాకేజీలు, మొత్తం 3 పంప్‌హౌజ్‌లు ఎత్తిపోతల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువ పొడవు 114 కిలోమీటర్లు. అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు, ముల్కలపల్లి మండలం వీకే రామవరం, కమలాపురంలో పంప్‌హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో పంప్‌హౌజ్‌లో 35 మీటర్ల లోతు నుంచి నీటిని లిఫ్ట్ చేసి పంపనున్నారు. మొదటి పంప్‌హౌజ్ అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ముల్కలపల్లి మండలం కమలాపురం వద్ద రెండు పంప్‌హౌజ్‌లను నిర్మిస్తున్నారు. బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌజ్ పనులు కాస్త మెరుగ్గానే సాగుతున్నా. రామవరం, కమలాపురం పంప్‌హౌజ్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
9 నుంచి 16 ప్యాకేజీ పనులు ముందుకెప్పుడు..?
సీతారామ ఎత్తిపోతల పథకం మొత్తం 16 ప్యాకేజీలుగా విభజించారు. 1 నుంచి 8 వరకు ప్యాకేజీ పనులు సాగుతున్నాయి. 9, 10, 11, 12, 14, 15, 16 ప్యాకేజీల టెండర్ ప్రక్రియ పూర్తవ్వగా... ఇంకా అగ్రిమెంట్ ప్రక్రియ మిగిలిఉంది. 8 ప్యాకేజీల వరకు భూసేకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరగాల్సి ఉంది. మొత్తం 114 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన కాలువ పనుల్లో కొన్ని చోట్ల మట్టి, కాంక్రీటు పనులు పూర్తవ్వగా... ఎక్కువ భాగం ఇంకా చేపట్టాల్సి ఉంది. మిగతా ప్యాకేజీల్లో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు.
లక్ష్యం నెరవేరాలంటే వేగం పెంచాల్సిందే...
మూడేళ్లలోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినా... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యమే జరుగుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ... వర్షాకాలం, వరదల ప్రభావంతో పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. దీనికి తోడు కూలీల కొరత కొంత వేధిస్తోంది. పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సీతారామపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తేనే పనులు వేగవంతమవుతాయి.
నేడు మంత్రి పువ్వాడ, ముఖ్య అధికారుల పర్యటన
కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల్లో సీతారామ ముందువరుసలో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు పనుల పురోగతిపై పర్యవేక్షించారు. ప్రస్తుతం సీతారామపై ప్రధాన దృష్టిసారించిన మంత్రి పువ్వాడ అజయ్... ఉన్నతాధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఎత్తిపోతల నిర్మాణంలో జాప్యానికి కారణాలు, భవిష్యత్‌లో పనుల వేగం కోసం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, వీకే రామవరం పంప్ హౌజ్ పనులను పరిశీలించనున్నారు. మంత్రితో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ రజత్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కూడా పర్యటనలో పాల్గొననున్నారు.