పురపాలక సంఘం స్పందించి తాగు నీటి కనెక్షన్ ఇప్పించాలి : స్థానికులు వర్షాలు లేక ఖమ్మం జిల్లా కేంద్రంలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నగరంలోని బహుళ అంతస్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి కోసం వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు. ఖమ్మం నగరంలోని అపార్టుమెంట్ వాసులు వర్షాలు కురిసి తమ కష్టాలు తీరాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. నగర పాలక సంస్థ తమకు నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.
పట్టణంగా ఉన్న ఖమ్మం... ఇప్పుడు నగరమైంది. అందుకు తగ్గట్టుగానే జనాభా కుడా పెరిగి, భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. నగరంలో మొత్తం 523 అపార్టుమెంట్లు ఉండగా ఒక్కో అపార్టుమెంట్లో సుమారు 10 నుంచి 30 కుటుంబాలు ఉంటున్నాయి. సగటున రోజుకు 300 లీటర్ల నీరు ఒక కుటుంబం వినియోగిస్తుంది. ఇందుకోసం బహుళంతస్తుల యాజమాన్యం బోర్లపై ఆధారపడుతుంటారు. వర్షాభావం వల్ల గత రెండు నెలలుగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. నగరంలోని పలు కాలనీల్లో బోర్లు ఎండిపోయాయి.
ఇంకుడు గుంతలు నిర్మించకపోవడం వల్ల ఎండిపోతున్న బోర్లు
ఖమ్మం జిల్లా కేంద్రంలో 15 ఏళ్ల క్రితం బహుళంతస్తుల కట్టడాలు ప్రారంభమయ్యాయి. గత పదేళ్ల వరకు ఆయా కాలనీల్లో పుష్కలంగా ఉన్న భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కనీసం 10 శాతం అపార్ట్మెంట్లలో కూడా ఇంకుడు గుంతలు తవ్వించకపోవటం వల్ల బోర్లు ఎండిపోతున్నాయి. పలు కాలనీల్లో సుమారు 500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు పడట్లేదని స్థానికులు వాపోతున్నారు. నగరపాలక సంస్థ తమకు నల్లా కనెక్షన్లు ఇస్తే నీటి కష్టాలు తీరతాయని కొరుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం
ఖమ్మం నగరంలో భూగర్భ జలాలు ఎండిపోయాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని నగర పాలక సంస్థ కమిషనర్ అన్నారు. అవసరం ఉన్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న బహుళంతస్తులు..ఇకనైనా నీటి వృథా అరికట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే నీటి ఎద్దడిని ఎదుర్కొవచ్చన్నారు.
ఇవీ చూడండి : సగం సంగారెడ్డి ఖాళీ... సీఎంకు జగ్గారెడ్డి లేఖ