క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యానికి తోడ్పడతాయని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ అమరవీరుల క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తిగత ఎజెండా పాటించకూడదని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఐక్యమత్యంతో నడవడమే అని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.
టెండర్లు వేసే ఎమ్మెల్యేను కాను
పెనుబల్లి నుంచి సత్తుపల్లి వరకు రూ. 70 కోట్లు జాతీయ రహదారి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే అన్నారు. ఆ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే ఎమ్మెల్యేనని, అంతేకానీ టెండర్లు వేసే ఎమ్మెల్యేని కానని సండ్ర చెప్పుకొచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నా వారిపై తాను కేసులు పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు జరిగిన సమావేశం అంశాలు బయటికి రావని.. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరందరికీ త్వరలోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేష్, ఎంపీపీ రఘు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'తలసాని మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి'