లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తల్లాడ మండలంలో పలు చోట్ల రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటను ఆరబోసి విక్రయించుకోవాలన్నారు.
ఈసారి ఆశాజనకంగానే...
ఉమ్మడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని పంటల దిగుబడులు ఆశాజనకంగానే వచ్చాయని పేర్కొన్నారు. వాటికి అనుగుణంగానే అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. కరోనా వల్ల ఇతర రాష్ట్రాల నుంచి గన్ని సంచులు దిగుమతి కష్టంగా ఉన్నా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. మామిడి ఉద్యాన సాగుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు అధైర్యపడకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరి రావు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :లాక్ డౌన్ ముగిశాక కొత్త రూల్స్ ఇవే...