Road Accident In Khammam : రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మృత్యువు ఏ వైపుగా వచ్చి కబళిస్తుందోనని హడలిపోతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల నుంచి వైరా వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం ప్రొద్దుటూరు నుంచి వైరా వైపు వెళ్తున్న ఓ లారీ లారీ సడన్గా బ్రేకు వేసింది. దీన్ని గమనించి వెనక ఉన్న కారు త్వరగా అప్రమత్తమైంది. కానీ కారు వెనక ఉన్న మరో లారీ డ్రైవర్ ఈ విషయాన్ని గమనించక లారీని వేగంగా నడపడంతో ఆ లారీ కాస్త కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు.. ముందు ఉన్న లారీలోకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Various Road Accidents In Telangana : ఖమ్మం జిల్లాలోనే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం వీఎమ్ బంజర్లో రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా ఢీకొన్న రెండు లారీల క్యాబిన్లు నుజ్జయి డ్రైవర్లు ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్లను బయటికి తీశారు. అప్పటికే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఒకరు బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్(35) కాగా మరొకరు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంతో రెండు గంటల పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై ప్రమాదానికి గురైన లారీలను ప్రక్కకు తీయించి పోలీసులు వాహనాల రాకపోకలకు అడ్డు తొలగించారు.