Revanth Reddy Monitoring Meeting in Khammam: జులై 2న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ జనగర్జన’ బహిరంగ సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగింపు వేడుకలకు వేదిక కానున్న ఈ సభను.. హస్తం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభను.. విజయవంతం చేసేందుకు నాయకత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ఖమ్మం నగర శివారులోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని సుమారు వందెకరాల్లో సభ నిర్వహణకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో కార్యకర్తల తరలింపుపైనా నేతలు దృష్టి సారించారు.
Congress leaders work division on Khammam Meeting : తెలంగాణ జనగర్జన ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అంతకుముందు ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్, మధుయాస్కీ భేటీ అయ్యారు. బహిరంగ సభ ఏర్పాట్లు, జనసమీకరణపై నేతలు చర్చించారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు.. జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం, పార్టీ నేతలు వీహెచ్, మధుయాస్కీ, మల్లు రవితో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి సభా ఏర్పాట్లు పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ఇతర సౌకర్యాల గురించి నేతలు ఆయనకు వివరించారు.
Revanth reddy Fire on TS Government : ఈ సభ నిర్వహించేందుకు ప్రభుత్వ సాకారం కావాలని కోరారని అన్నారు. ఆ రోజున కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పొంగులేటి అడిగారని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బస్సులను పంపేందుకు అనుమతి ఇచ్చిన.. ప్రస్తుతం అనుమతిని నిరాకరిస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ రోజు బస్సులను ఇచ్చినా.. ఇవ్వకపోయిన సొంత వాహనాల్లో సభకు రావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ అడ్డుగోడలు కడితే దూకి వస్తారని.. వారే అడ్డుగా వస్తే తొక్కుకుంటూ వస్తారని తెలిపారు. ఏదిఏమైనా బీఆర్ఎస్ సభ కంటే అధిక సంఖ్యలో ఈ సమావేశానికి వస్తారని అన్నారు.
Revanth Reddy talk about Podu Lands : ఖమ్మం సభతో బీఆర్ఎస్ పాలనకి సమాధి కడుతామని అన్నారు. పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపిస్తే.. రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇస్తామని తెలిపారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో కలిపేస్తారని విమర్శించారు. గిరిజనులపై కేసులను పట్టించుకోని కేసీఆర్ పోడు పట్టాలు ఇచ్చారని.. దీనికి కారణం కాంగ్రెస్ పోరాటమేనని అన్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు.