Revanth Reddy Padayatra in bhadradri : హాథ్ సే హాథ్ సే జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి మణుగూరు అంబేడ్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ పార్టీ అధ్యక్ష్య పదవినైనా దళితుడికి కట్టబెట్టగలరా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Hath se Hat Jodo Yatra in Bhadradri : ప్రజాపోరాటాలు, యువకుల త్యాగాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే... కేసీఆర్ జనం ఆకాంక్షాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములపై తొమ్మిదేళ్లుగా ఏం చేయని కేసీఆర్.. 9 నెలల్లో ఏదో చేస్తామని హామీ ఇస్తున్నారని విమర్శించారు. మోదీ పాలన కంటే మన్మోహన్ నయమని చెబుతున్నసీఎం... నోట్ల రద్దు, జీఎస్టీ సహా అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు.
"మన్మోహన్ పాలనలో దేశం బాగుంది, మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అంటున్నారు. మరి అలాంటిది నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, ట్రిపుల్తలాక్ మొదలైన అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, బీఆర్ఎస్ దొరల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదోల పార్టీ, దళితుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దళిత వర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో దళిత వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయకపోయినా పార్టీ అధ్యక్షుడిగానైనా నియమించాలని సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయాలకే సిలిండర్ ఇస్తాం. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి తోడ్పడతాం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ముఖ్యంగా రైతుల సాదకబాధకాలకు చరమగీతం పాడతాం. " - రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు