Rebel Candidates Tension in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Joint Khammam District) పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు.. ఎన్నికల బరిలో నిలిచారు. తమకు టికెట్ దక్కకపోవడంతో భగ్గుమన్న అసమ్మతులు ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ సొంత పార్టీకి సవాల్ విసిరి నామపత్రాలు దాఖలు చేశారు. ఉభయ జిల్లాల్లోని అధికార భారత్ రాష్ట్ర సమితితోపాటు కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తప్పలేదు.
Khammam Political News Latest :మధిర, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు (Rebel Candidates in Telangana Assembly Elections) బరిలో నిలవగా.. పాలేరు, వైరా, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెబల్స్ తలనొప్పులు ఉన్నాయి. పార్టీ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలు.. పార్టీల నుంచి తిరుగుబాటుదారులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటి వరకు తుది గడువు ఉంది. దీంతో ఏ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి రెబల్స్ పోటీలో ఉన్నారో వారిని తప్పించేందుకు ఆయా పార్టీలు, అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. బరిలో ఉన్న తిరుగుబాటుదారుల నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు.
Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు
Dissent Leaders Issue in Political Parties :పాలేరులో కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న రామసహాయం మాధవి రెడ్డిని.. జిల్లా పార్టీ నాయకులు బుజ్జగించినా ఫలితం లేకపోయింది. దీంతో హస్తం పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆమె బరిలో ఉంటానని చెబుతున్నారు. వైరాలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రామ్మూర్తి నాయక్‌ను.. జిల్లా నేతలు బుజ్జగించినా వెనక్తి తగ్గలేదు. దీంతో.. సొంత నియోజకవర్గంలో తిరుగుబాటుదారు లేకుండా చేసేందుకు స్వయంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) ఆయనతో మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వాలని రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేస్తున్నారు.
వైరాలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలో ఉన్న గిరిబాబు నామినేషన్ ఉపసంహరించుకునేలా.. గులాబీ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మధిరలో భారత రాష్ట్ర సమితి రెబల్‌గా బరిలోకి దిగిన బొమ్మెర రామ్మూర్తి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో పోటీలో ఉంటానని తెగేసి చెబుతున్నారు. ఇల్లందు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి. చీమల వెంకటేశ్వర్లు, బానోత్ స్రవంతి, మంగీలాల్ నాయక్, మోహన్ జీ, నామోదర్ నాయక్ బరిలో ఉండటంతో నామినేషన్లు ఉపసంహరించుకునేలా నాయకులు పావులు కదుపుతున్నారు.