తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా రేషన్​ దందా.. అక్రమ వ్యాపారులపై పీడీ యాక్టు ఊసెత్తని యంత్రాంగం - telangana varthalu

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం.. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఏళ్లుగా అదే తంతుగా ఒకే పంథాలో సాగుతున్న రేషన్ బియ్యం దందాకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రూ.కోట్ల విలువైన బియ్యం అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అడపాదడపా చేస్తున్న దాడుల్లోనే రూ.కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుబడుతుండగా.. అధికారుల కళ్లు గప్పి పక్కదారి పడుతున్న బియ్యం విలువకు లెక్కేలేదు. అక్రమార్కులకు కొన్నిశాఖల అధికారుల అందదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలకు కొదవేలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతుందన్న వాదనకు తూతూమంత్రంగా నమోదవుతున్న కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

జోరుగా రేషన్​ దందా.. అక్రమ వ్యాపారులపై పీడీ యాక్టు ఊసెత్తని యంత్రాంగం
జోరుగా రేషన్​ దందా.. అక్రమ వ్యాపారులపై పీడీ యాక్టు ఊసెత్తని యంత్రాంగం

By

Published : Aug 30, 2021, 8:01 AM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాఫీగా సాగుతోంది. ఉభయ జిల్లాల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం దందా ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతుందే తప్పా.. అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, ఖమ్మం గ్రామీణం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ, ఎర్రుపాలెం, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో రేషన్ బియ్యం దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం, గుండాల ఆళ్లపల్లి మండలాల్లో అడ్డూ అదుపూ లేకుండా మరీ ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి తరలుతున్న రేషన్ బియ్యం లెక్కకు అంతే లేకుండా పోతోంది.

జిల్లా సరిహద్దు మండలాలు, ప్రాంతాల్లో తరచూ క్వింటాళ్ల కొద్దీ రేషన్ బియ్యం పట్టుబడుతుండటమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మధ్య దళారీలు నేరుగా చౌక ధరల దుకాణాల నుంచే బియ్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్థానిక ఏజెంట్లు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తుంటే.. ఆ బియ్యం మొత్తాన్ని రాత్రి వేళల్లో స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసే ముఠాలు ఎక్కడి ప్రాంతాల వారు అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తే.. ఆ తర్వాత రోజు నుంచీ నెలాఖరు వరకు జోరుగా అక్రమ కొనుగోళ్లు సాగుతున్నాయి. కొందరు వ్యాపారులు స్థానికంగా ఉండే మిల్లర్లకు కూడా అమ్ముతున్నారు. అక్కడ వాటిని రీ సైక్లింగ్ చేసి గిడ్డంగులకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలామంది లబ్ధిదారులు డీలర్ల దగ్గరే బియ్యం వదిలేస్తున్నారు. ఆ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.

ఖమ్మం టూ కాకినాడ..

ఉభయ జిల్లాల నుంచి యథేచ్చగా సాగుతున్న రేషన్ బియ్యం దందా అంతా ఖమ్మం టూ కాకినాడ అన్నట్లు సాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చేరుకుంటున్న రేషన్ బియ్యం వక్రమార్గంలో కాకినాడ చేరుతోంది. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేరుతోంది. స్థానికంగా లబ్ధిదారుల నుంచి కిలో రేషన్ బియ్యం కేవలం రూ.8 వరకు కొనుగోలు చేస్తున్న ఏజెంట్లు ..ఆ తర్వాత మధ్య దళారీలకు రూ.12 వరకు అమ్ముకుంటున్నారు. స్థానిక వ్యాపారులు ఆ బియ్యాన్ని బడా వ్యాపారులకు రూ.20 వరకు అమ్ముకుంటుండగా.. సరిహద్దులు దాటే సరికి రేషన్ బియ్యం ధర రూ.30 వరకు పలుతుతోందన్న మాట. ఇలా 60 శాతం బియ్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

దొరికేది గోరంతే..

పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా.. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతున్నా.. అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుంది. ఉభయ జిల్లాల్లో రేషన్ బియ్యం దందా రోజురోజూ పేట్రేగిపోతుంటే ఉక్కుపాదం మోపాల్సిన పౌర సరఫర, రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాయి. అడపా దడపా టాస్క్​ఫోర్స్ బృందాలే దాడులు చేసి రేషన్ బియ్యం పట్టుకుంటున్నాయి తప్పితే.. పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయనేందుకు ఆ శాఖ నమోదు చేసిన కేసులే తార్కాణంగా నిలుస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో టాస్క్​ఫోర్స్ దాడుల్లో 2020లో మొత్తం 75 కేసులు నమోదు కాగా.. 4,107 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. రూ.1.10 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 కేసులు నమోదు చేసి రూ.2.5 కోట్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. 300 వాహనాలు సీజ్ చేసి 100కు పైగా గోదాములు సీజ్ చేశారు. జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కేసులు నమోదు చేసి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.40 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2020లో మొత్తం 104 కేసులు నమోదు చేసి 510 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. 2021లో ఇప్పటి వరకు 45 కేసులు నమోదు చేసి సుమారు 2437 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 2020 నుంచి ఇప్పటి వరకు టాస్క్​ఫోర్స్ పోలీసులు 31 కేసులు నమోదు చేసి సుమారు 2500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.

తెలిసినా తెలియనట్టే..

రేషన్ బియ్యం అక్రమ దందాను ఉభయ జిల్లాల్లో ఏళ్లుగా వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే వ్యాపారులు శాసిస్తున్నారు. మండలాల వారీగా ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలిస్తున్నారు. మండలానికి 10 నుంచి 20 మంది వ్యాపారులే ఏళ్ల తరబడి ఈ బియ్యం దందాను శాసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక ముఠాలు ఏర్పడి రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఏ మండలాన్ని ఎవరు శాసిస్తున్నారు.. ఏ ప్రాంతంలో రేషన్ బియ్యం దందా సాగించేదెవరు అన్నది ప్రభుత్వ శాఖల అధికారులకూ తెలుసు. అయినా.. అక్రమ వ్యాపారానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. తరచూ రవాణా జరిపే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేస్తున్నాం. ఈ ఏడాది 40 కేసులు నమోదు చేశాం. ఒకే వ్యక్తి 6 నెలల్లో మూడు సార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తాం. కొన్నిసార్లు దాడులు చేస్తామన్న సమాచారంతో కొంతమంది పారిపోతున్నారు.-రాజేంద్రప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఖమ్మం

పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రత్యేక నిఘా..

ఏపీకి సబ్సిడీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు జిల్లాలో కొన్ని నిల్వ ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని కాకినాడ ప్రాంతానికి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసు శాఖ తరపున ప్రత్యేక నిఘా పెట్టాం. పోలీసు, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు నిర్విరామంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 కేసులు నమోదు చేసి సుమారు రూ.2.5 కోట్ల సబ్సిడీ రేషన్ బియ్యం పట్టుకున్నాం. అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. - విష్ణు.ఎస్.వారియర్, ఖమ్మం సీపీ

రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేస్తున్నాం. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన బియ్యాన్ని వినియోగించుకోవాలి. అక్రమార్కులకు సహకరించే లబ్ధిదారుల రేషన్ కార్డులు రద్దు చేస్తాం. -చంద్రప్రకాశ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇదీ చదవండి:preparations: పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేద్దాం..!

ABOUT THE AUTHOR

...view details