Congress Public Meeting Khammam on July 2nd : ఖమ్మంలో జులై 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు పీసీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచర గణం చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు రెండిటికి కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న సభ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
గతంలో ఎన్నడూ ఎవరూ నిర్వహించనంత భారీగా ఈ సభను నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం పట్టణ సమీపంలో 110 ఎకరాల భూమిలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తోంది. చేరికలతోపాటు సభ పాదయాత్ర ముగింపునకు చెందిన సభ కావడం, ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు అవుతుండడంతో భారీ జనసమీకరణ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది. సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై ఇవాళ ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించనుంది.
Rahul Gandhi Attends Khammam Congress Public Meeting :పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేల నేతృత్వంలో ఖమ్మంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే నాయకులకు సమాచారం అందజేశారు. ఈ సన్నాహక సమావేశంలో రెండవ తేదీన సభ నిర్వహణ, విధి విధానాలు, జన సమీకరణ, ప్రచార ఆర్భాటం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.