Congress Public Meeting at Khammam Today :రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఎటుచూసినా నగరం చుట్టూరా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో కాంగ్రెస్‌లో సరికొత్త సందడి సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ... భారీగా జనసమీకరణతో సత్తా చాటాలని యోచిస్తోంది. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
Rahul Gandhi attends Khammam Meeting Today : ఆదివారం మధ్యాహ్నం తర్వాత దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. బహిరంగ సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి సభలో పాల్గొంటారు. సభలో తొలుత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారు. పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రముగింపు సందర్భంగా... భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ముఖ్యనేతలు హస్తం గూటికి చేరనున్నారు. వీరితోపాటు పొంగులేటి ముఖ్య అనుచరులు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది ఉన్నారు.
కనీవినీ ఎరగని రీతిలో జనగర్జన సభకు ఏర్పాట్లు :ఇక బహిరంగ సభకు కాంగ్రెస్ కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేలాది మందిని బహిరంగ సభకు తరలించేలా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీగా కార్యకర్తల్ని తరలించేలా సన్నాహాలు చేశారు. పొరుగునే ఉన్న జిల్లాల్లోని పలు నియోజకవర్గాల నుంచీ కార్యకర్తలను తరలిస్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా కార్యకర్తలను తరలించేలా క్షేత్రస్థాయిలో నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభా వేదిక, బహిరంగ సభ స్థలి మొత్తం కలిపి దాదాపు 40 ఎకరాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎల్ఈడీ తెరను సభా వేదిక వెనుక భాగంలో రూపొందించారు. సభా వేదికకు ఇరు వైపులా భారీ ఎల్ఈడీ తెరలతో ముఖ్య నేతల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.