Puvvada Fires on Tummala Over Fraud Votes Complaint :రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు పువ్వాడ.. మరోవైపు తుమ్మల మాటల తూటాలతో కత్తులు దూస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ తలపడతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం పర్యటన అనంతరం.. తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇలా రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ తర్వాత వాళ్లకు ఓటమి భయం పట్టుకుందంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తుతున్నారు.
Puvvada Comments on Tummala :మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తుమ్మలకు ఓటు వేసే వారికే ఓటు ఉండాలా అని ప్రశ్నించిన పువ్వాడ.. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు.
ఇదీ జరిగింది :ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 35 వేల దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని.. దిల్లీలో భారత ఎన్నికల సంఘానికి(Election Commission of India) సోమవారం రోజున ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తుమ్మలతో పాటు సహ కార్యకర్త కోయిన్ని వెంకన్న తాను సేకరించిన సమాచారంతో ఈసీ అధికారులను కలిశారు. ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు చెందిన మమత వైద్య, దంత కళాశాలల్లోని వసతి గృహాలు, వివిధ బ్లాక్‌ల్లో వందల కొద్దీ దొంగ ఓట్లను నమోదు చేశారంటూ సంబంధిత వివరాలను ఫిర్యాదు కాపీకి తుమ్మల జత చేశారు.