BRS Atmiya Sammelan In Khammam: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా 10కి 10 స్థానాలు గెలిచి చూపిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి.. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ.. తమపై ఆరోపణలు చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక ఇస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలు, పార్టీని బయటకు వెళ్లిన వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే నగరంలో జరిగిన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవని.. ఈ సందర్భంగా ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీని వాడుకున్న వారు.. ఇవాళ పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్నారన్నారు. వీటన్నింటిపై ప్రజలే రానున్న ఎన్నికల్లో తగు బుద్ధి చెప్పుతారని.. ఆ రోజు ఎంత దూరంలోనూ లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని.. తగిన సమయంలో భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారికి నివాళి: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ఖానాపురం హవేలీ డివిజన్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. చీమలపాడు ఘటనలో మృతి చెందిన పార్టీ కార్యకర్తలు ఆత్మకు శాంతి కలగాలని కాసేపు మౌనం వహించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు సంపక్తి భోజనాలు వడ్డించడం జరిగింది.