ఖమ్మం జిల్లా ముదిగొండ పరిధిలోనిఆరెగూడెంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా అతడి కుటుంబసభ్యులను కరోనా పరీక్షలు చేయించుకునేందుకు గ్రామం నుంచి బోదులబండలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సర్పంచి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రామారావు కలిసి వారిని పంచాయతీ ట్రాక్టర్‌లో వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యశాలలో కరోనా పరీక్షల అనంతరం తిరిగి వారిని ట్రాక్టర్‌లో ఇంటి వద్ద దింపారు. మామూలు రోజుల్లో పొద్దున లేస్తే.. తీపి మాటలతో కడుపు నింపే చాలామంది నిజ స్వరూపాన్ని కరోనా బయట పెడుతున్నది.
మధిర గ్రామీణ మండలంలోని చిలుకూరులో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి కుటుంబంలో ఇంకా ఐదుగురు సభ్యులున్నారు. మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించటం కోసం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కానీ.. బంధువులెవరూ ముందుకు రాకపోగా.. గ్రామ సర్పంచ్ తన బాధ్యతగా వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం భౌతిక దూరం పాటిస్తూ తిరిగి వారిని ఇంటికి చేర్చారు.