YS Sharmila On Paddy Procurement: కేంద్రంపై తెరాస చేస్తోన్న ధర్నాలు, రాస్తారోకోలు అంతా డ్రామా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఖమ్మం జిల్లా ముత్తగూడెం రైతు ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... రైతులను వెన్నుపోటు పొడిచినట్లు విమర్శించారు. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి పెట్టినట్లు ఆరోపించారు. కమీషన్ రూపంలో తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని మండిపడ్డారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రైతులు నిరసన తెలపక పోతే రైతుబంధు కట్ చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. మంత్రి ఏమైనా తన ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా అని నిలదీశారు. ఆయన రైతులను బెదిరిస్తున్నాడని... ఇది ప్రజాస్వామ్యం కాదా? రైతులను బెదిరించడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్.. సంతకం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నాడన్నారు. వరి ధాన్యం కొనాల్సిందే అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తమ పార్టీ అధికారంలో రాగానే రైతు రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పావలా వడ్డీకే రుణాలు, నష్టపరిహారం ఇస్తామని ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.