నైరుతి రుతుపవనాల రాష్ట్రంలో ప్రవేశించడంతో.... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు సందడి మొదలైంది. తొలకరి పలకరింపుతో రైతులు వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మండల కేంద్రాలు, స్థానికంగా ఉన్న దుకాణాల్లో.... విత్తనాలు కొనేందుకు వస్తున్న రైతులతో సందడి నెలకొంది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి సాగు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రైతులంతా విత్తనాలకోసం కంపెనీలు, దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ విత్తనాలు, ఎరువుల దుకాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఖమ్మం జిల్లాలో 300, భద్రాద్రి జిల్లాలో 400 వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని చాలావరకు దుకాణాలు.... కూడబలుక్కున్నట్లు విత్తనాలు ధరలు పెంచేశాయి. రైతులు అడిగిన కంపెనీ విత్తనాలు ఇవ్వడం లేదు. అటు రైతు బంధు నగదు ఇంకా రాక.. పంట దిగుబడిపై ఆశలు లేక... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.