ఈ ఏడాది అధిక వర్షాలతో వరి, పత్తి పంటలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఆ పంటల్లో పెట్టుబడులు కూడా రాకపోవడంతో చాలావరకు కర్షకులు అప్పుల పాలయ్యారు. కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ తరుణంలో మిరపసాగు కొంత ఊరటనిచ్చినా చివరికి అదికూడా కంట తడిపెట్టిస్తోంది. పొలం నిండా దిగుబడి వచ్చినా కోసే దిక్కులేక కళ్లెదుటే నేలపాలు చేసుకోవాల్సి రావడం వల్ల అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. క్వింటాకు ధర రూ.15 వేల వరకు ఉండటంతో వరి, ప్రత్తికి చేసిన అప్పులు తీరి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కూలీల కోసం జిల్లాలు దాటి వెతుకుతున్నా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల కుటుంబ సభ్యులే అయిన కాడికి కోతలు చేసుకుంటున్నారు. ఎండల తీవ్రతకు తట్టుకోలేక మిరప మొక్కలు తొలగించి చెట్ల నీడన కాయలు కోస్తున్నారు.
పొలాల్లోనే నివాసం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 68 వేల ఎకరాల్లో అధికంగా మిర్చి సాగు చేశారు. జనవరి చివరి వారం నుంచి దిగుబడులు రాగా.. తొలివిడత కోతలు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలతో కోయించారు. జనవరి నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి కూలీలు పెద్దసంఖ్యలో వలస వచ్చారు. 25 వేలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాగా రైతులకు చాలా ఊరటనిచ్చింది. స్థానిక కూలీలతో పనిలేకుండా వసలతోనే పూర్తిగా తొలికోతలు చేయించారు. పొలాల్లోనే నివాసం ఉంచి వారికి ఏర్పాట్లు చేశారు. తొలికోత పూర్తికావడం ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి మహారాష్ట్రలో కరోనా కేసులు ఉద్ధృతం కావడం వల్ల గత ఏడాది నడిచి వెళ్లిన పరిస్థితులు తలుచుకుంటూ వలసలు తిరుగు పయనమయ్యారు. ఒక్కో ముఠా సదురుకోవడం మార్చి చివరి వారం నాటికి అంతా వెళ్లిపోవడంతో.. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ఒకే కోతతో పూర్తిచేయాలని అలాగే ఉంచడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు రెండో కోత వచ్చి కోసేవాళ్లు లేక పొలాల్లోనే పంటను ఎండబెడుతున్నారు.