తెలంగాణ

telangana

ETV Bharat / state

Pregnant womens problems: గర్భిణీలకు స్కానింగ్ కష్టాలు.. గంటలపాటు నిరీక్షణ - khammam

Pregnant womens problems: కడుపులో బిడ్డతో కిలోమీటర్ల మేర ప్రయాణం. కాళ్లు, చేతులు లాగుతున్నా గంటల తరబడిగా నిరీక్షణ. నిండు గర్భిణుల కష్టం చూసి... కనీసం కనుకరించే వారైనా కనిపించరు. ఖమ్మం జిల్లా ఆస్పత్రికి పరీక్షల కోసం వచ్చే గర్భిణులు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలివి. రేడియాలజిస్టుల కొరత... ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం.... వీరి పాలిట శాపంగా మారుతోంది.

Pregnant womens problems
గర్భిణీలకు స్కానింగ్ కష్టాలు

By

Published : Jun 23, 2022, 4:10 PM IST

Pregnant womens problems: ఖమ్మం జిల్లా మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి స్కానింగ్ కోసం వచ్చే గర్భిణులు ..నిత్యం అవస్థలు పడుతున్నారు. ఎన్నో కష్టాలకోర్చి... సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆస్పత్రిలో గంటల తరబడి నిరీక్షించినా వైద్యపరీక్షలు చేయకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం సుమారు 200 మంది ఆస్పత్రికి వచ్చారు. స్కానింగ్ విభాగం వద్ద భారీగా గర్భిణులు బారులు తీరారు. 4గంటలపాటు వరుసలో నిల్చున్నా తమకు పరీక్షలు చేయలేదని ఆందోళనకు దిగారు.

కొద్దిరోజులుగా 'రేపు రండి.. మరో రోజు రండి' అంటూ ఆస్పత్రి చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. కనీసం తాగునీరు కూడా లేదని.... కూర్చునేందుకు కుర్చీల్లేక నీరసించిపోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు బాగున్నాయని ఆస్పత్రికి వస్తే.... స్కానింగ్ కూడా చేయడం లేదన్నారు. కొద్దిమందికి మాత్రమే పరీక్షలు చేశారని అందులోనూ పైరవీలకు చేసుకున్నవారికే అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గర్భిణీలకు స్కానింగ్ కష్టాలు.. గంటలపాటు నిరీక్షణ

జిల్లా ఆస్పత్రిలో అవసరాలకు తగినట్లుగా రేడియాలజిస్టులు అందుబాటులో లేరు. కొన్నేళ్లుగా ఒక్కరితోనే స్కానింగ్‌ ప్రక్రియను నెట్టుకొస్తున్నారు. రేడియాలజిస్టు కోసం నోటిఫికేషన్లు జారీ చేసినా.... ఎవరూ రాలేదు. స్కానింగ్‌ చేయడంతోపాటు రిపోర్ట్‌ సిద్ధం చేయాల్సి ఉండటంతో... వైద్య సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వాసుపత్రికి ఉమ్మడి ఖమ్మం నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలవారు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల నుంచి సైతం గర్భిణీలు వైద్య పరీక్షల కోసం వస్తుంటారు. మధ్యాహ్నం 12 గంటలకే స్కానింగ్ కేంద్రం వద్ద పరీక్షలు నిలిపివేస్తున్నారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఒక్కరే రేడియాలజిస్టు ఉన్నారని.. తాను కూడా సెలవులో ఉండటంతో ప్రైవేటు వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. గర్భిణీలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మాతాశిశు కేంద్రంపై ప్రత్యేక దృష్టిసారించారని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details