Ponguleti Visited cheemalapadu Fire Accident Victims: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటనకు సంబంధించి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులను నిందితులుగా చేస్తూ కేసు నమోదు చేయాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.
ఇది ముమ్మాటికి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన హత్యలేనని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఇది అధికారిక కార్యక్రమం కాదని.. ఏదో మొక్కుబడిగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారని విమర్శించారు. మరణించిన వారికి రూ.50 లక్షలు.. గాయపడిన బాధితులకు రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఎర్రపాలెం మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నేటి వరకు చెల్లించలేదని శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు.
తాను రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం లేదని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధం లేదని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుందని విమర్శించారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని.. జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసును పోలీసులు సరిగ్గా విచారించడం లేదన్నారు. నిందితులను శిక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే: చీమలపాడులో రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు వస్తుండగా.. కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలోనే సమీపంలోని గుడిసెపై నిప్పు రవ్వలుపడి మంటలు వ్యాపించాయి. ఇందులో భాగంగానే మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్.. ఒక్కసారిగా పేలింది. దీంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే క్రమంలో మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.