Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Paleru: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ.. ఖమ్మం జిల్లాలోని ప్రజా ప్రతినిధుల ఓటమే లక్ష్యంగా పని చేయాలని.. ఏ జెండా పట్టుకున్నా తన ఎజెండా ఇదేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులకు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆరు దశాబ్దాలు అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు ఈ ప్రభుత్వం వల్ల దగాపడ్డారని పేర్కొన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. ఐదు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తీసుకెళ్లి నట్టేటా ముంచిందని తీవ్ర విమర్శలు చేశారు. నియామకాల కోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో.. ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగాపడిందని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడ్డామని... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీళ్లు కోసం నిధులు కోసం ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత.. జీవితాలు మారిపోతాయని కలలు కన్న ప్రజలకు.. చివరికు ఈ ప్రభుత్వం వల్ల కలలే మిగిలాయని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు ఆ పనే చేయలేదని తెలిపారు. దళిత బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలోని 100 మందికి ఇచ్చి.. చేతులు దులుపుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.