తెలంగాణ

telangana

ETV Bharat / state

వాటిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది: పొంగులేటి - Ponguleti Srinivas Reddy latest comments

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌ వస్తుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి వ్యాఖ్యానించారు.

ponguleti
ponguleti

By

Published : Jan 30, 2023, 3:16 PM IST

Updated : Jan 30, 2023, 4:05 PM IST

గత కొంతకాలంగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తన కార్యకర్తలతో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మరోసారి ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. రెండోసారి అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తనను నమ్ముకున్న కార్యకర్తలను ఇబ్బందిపెట్టారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలను కలవడానికి వెళ్తే.. అక్కడి ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికీ ఆత్మ గౌరవం ఉంటుందన్న పొంగులేటి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌ వస్తుందా అని ప్రశ్నించిన శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 20 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు.

''నన్ను నమ్ముకున్న కార్యకర్తలను ఇబ్బందిపెట్టారు. నా కార్యకర్తలను కలవడానికి వెళ్తే.. అక్కడి ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవం ఉంటుంది. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌ వస్తుందా? ఇచ్చిన హామీలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగేళ్లలో ఇప్పటి వరకు 20 శాతమే రుణమాఫీ జరిగింది.'' - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ

వాటిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది: పొంగులేటి

పొంగులేటి అడుగులు ఎటు..:అయితే బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నెక్ట్స్‌ ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆ పార్టీ నేతలు ఇటీవల పొంగులేటిని కలిసి ఆహ్వానించారు. అయినప్పటికీ పొంగులేటి ఏ నిర్ణయం చెప్పలేదు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన సొంతగూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో వైఎస్సార్‌టీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే పొంగులేటి సొంత గూటికి చేరతారా.. లేదా కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని మన్నించి రేవంత్‌ సారథ్యంలో నడుస్తారా అనేది చూడాలి మరి.

Last Updated : Jan 30, 2023, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details