ponguleti srinivas reddy latest news: భారత్ రాష్ట్ర సమితితో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 7 ఏళ్ల రాజకీయ బంధానికి తెరపడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో పాటు అధినేత కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పొంగులేటిని బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్‌ఆర్‌సీపీ నుంచి మొదలైంది. 2013 ఫిబ్రవరి 23న రాజకీయ రంగప్రవేశం చేసిన పొంగులేటి.. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనతో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
What is ponguleti's next step : ఈ సమయంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను పొంగులేటికి అప్పగించారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పొంగులేటి విజయం సాధించారు. మరో 3 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్యేలు కారెక్కారు. అనంతరం, రెండేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగిన ఆయన.. కేసీఆర్ ఆహ్వానం మేరకు 2016 మే 4న గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఓటమికి పొంగులేటే కారణం..: వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన పొంగులేటి.. తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనేనని బలంగా విశ్వసించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి దక్కిన ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు పార్టీకి పొంగులేటికి మధ్య అగాధం పెంచుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ గెలుపొందగా.. మిగిలిన 9 స్థానాల్లో పరాజయం పాలైంది. సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి కారణమంటూ జిల్లా నేతలు కొందరు అధినేతకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్.. జిల్లాలో ఓటమికి ఒకరినొకరు కత్తులతో రాజకీయంగా పొడుచుకోవడమే కారణమని వ్యాఖ్యానించారు.
రాజ్యసభ అవకాశం దక్కుతుందని భావించినా..: పొంగులేటికి బీఆర్‌ఎస్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన తనను కాదని.. నామ నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వడంతో పొంగులేటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్.. పొంగులేటి రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ అవకాశం దక్కుతుందని భావించినా అదీ దక్కలేదు.
ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం..: పార్టీలో ఎదురవుతున్న అవమానాలపై దాదాపు 3 ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన అసంతృప్తి, ఆవేదనను అనుచరులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి తీరును ప్రశ్నించి తొలిసారి తన అసంతృప్తిని బహిరంగ పరిచారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు.