Ponguleti fires on BRS : ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో రాహుల్‌గాంధీ విమర్శలతో అధికార బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నేతల విమర్శలు-ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం జిల్లాలో తమ పార్టీకి పట్టిన పీడ విరగడైందని పొంగులేటిని ఉద్దేశించి విమర్శించిన మంత్రి పువ్వాడ.. ఈసారి 9 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాలనే కాదు... తెలంగాణవ్యాప్తంగా 100 సీట్లను కాంగ్రెస్ గెల్చుకోబోతుందని పొంగులేటి తేల్చి చెప్పారు.
ఈ నెల ఆఖరికి కాంగ్రెస్‌లోకి పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు :ఈ క్రమంలోనే జులై చివరిలోపు అధికార పార్టీ నుంచి ప్రముఖులు కాంగ్రెస్‌లోకి రాబోతున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ బయటికి వెళ్లే పరిస్థితి లేదన్న ఆయన.. తన అనుచరులైనా, ఎవరైనా సర్వేల ప్రకారమే పార్టీల టికెట్లు కేటాయించటం జరుగుతుందన్నారు. పార్టీలో అందరం కలిసే ఉంటామని.. కేసీఆర్‌ను గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తాను నాలుగు కాదు ఆరు మెట్లైనా దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
'నిన్నటి కాంగ్రెస్ సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ అన్ని విధాలా ప్రయత్నించింది. డబ్బులు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నేతల సభకు మాత్రం ఆర్టీసీ బస్సులు ఇస్తారు. నిన్నటి కాంగ్రెస్ సభలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. రాహుల్ గాంధీని కంటికి రెప్పలా కాంగ్రెస్ శ్రేణులు కాపాడుకున్నారు. కాంగ్రెస్ సభకు వెళ్తే పథకాలు రావని ప్రజలను బీఆర్ఎస్ నేతలు బెదిరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా సభ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభకు వచ్చారు.'-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ
నిన్నటి కాంగ్రెస్ సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ అన్నివిధాలా ప్రయత్నించింది : పొంగులేటి కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ :ఇదిలా ఉండగా.. నిన్న రాహుల్ చేసిన విమర్శలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖమ్మం సభలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. రూ.4 వేల పింఛన్ ఇస్తామంటూ ప్రజలను రాహుల్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది రాచరికం అంటున్నారన్న ఆయన... సీఎం కేసీఆర్‌ది రాచరిక పాలన కాదని.. జనరంజక పాలన అని వ్యాఖ్యానించారు. ఏ హోదా ఉందని ఖమ్మం సభలో రాహుల్ మాట్లాడి వెళ్లారని వేముల ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి :