ఖమ్మం పార్లమెంట్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామస్థులు ఓటింగ్ బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. దివ్యాంగ ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ నాలుగు గంటలకే ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటేసిన ప్రముఖులు
తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమని నామ ఉద్ఘాటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి ఓటు వేశారు. మహిళలంతా తన వెంటే ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఈవీఎంల మొరాయింపు
జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వైరాలో ఓటింగ్ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల చాలా సేపటి వరకు ప్రక్రియ నిలిచిపోయింది. ఏన్కూరులోనూ మెషీన్లలో సాంకేతిక లోపం కారణంగా ప్రజలు ఓటు వేయడానికి వేచి చూడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఓటర్లు నిరాశగా వెనుదిరిగారు. సత్తుపల్లిలోని కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పని చేయలేదు. అధికారులు వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారు.