Political Heat in Khammam : పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ ఇటీవల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం వచ్చే వారం నుంచి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉభయ జిల్లాల్లోని అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ప్రచ్చన్నయుద్ధం.. ఆ పార్టీకి తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.
పాలేరులో నేతల మధ్య వర్గపోరు : నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలంటూ అధినాయకత్వం ఆదేశాలు ఇస్తున్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో నాయకులంతా ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కుమ్ములాటలకు కేంద్రంగా బీఆర్‌ఎస్ రాజకీయాలు సాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. పాలేరులో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో తుమ్మలపై గెలుపొందిన కందాల.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీలో వర్గపోరుకు తావిచ్చింది. ఇరువురు నేతలు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ టికెట్ తనకే వస్తుందంటూ కందాల ప్రజల్లోకి వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రమే తనకు టికెట్ వచ్చేలా చేస్తుందన్న ధీమాతో తుమ్మల ఉన్నారు. పార్టీ అధినేత ఎవరివైపు మొగ్గుచూపుతారో ఇప్పుడే తెలియనప్పటికీ.. పాలేరులో బీఆర్‌ఎస్ శ్రేణులు వర్గాలుగా విడిపోయి తమ నేతకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి.
వైరా నియోజకవర్గంలో త్రిముఖ పోరు : వైరా నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో త్రిముఖ పోరు రక్తికట్టిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలిచిన రాములు నాయక్.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో అప్పటికే రెండు వర్గాలుగా ఉన్న పార్టీ కాస్తా... ఇప్పుడు మూడు వర్గాలైంది. మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రవతి.. వైరా టికెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గురు నేతలు పార్టీ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తమనే కరుణిస్తుందని చెప్పుకుంటున్నారు.