All Parties Started Election Campaign From Khammam :ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అన్ని జిల్లాలకన్నా ముందే ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రాజకీయ పరిణామాలు రంజుకున్నాయి. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ... ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఆ తర్వాత తెలుగుదేశం సైతం ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించగా... ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ పేరుతో సీపీఎం భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహించి..... వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన పేరిట సభ నిర్వహించిన సీపీఐ.. వచ్చే ఎన్నికలకు ఈ బహిరంగ సభ నాందిగా పేర్కొంది.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఖమ్మం గుమ్మం నుంచే రాజకీయ సైరన్ మోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లోజరిగిన భారీ బహిరంగ సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైనప్పటికీ.. ఈ నెల 15న ఖమ్మం వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీకి బలం లేదన్న చోటే సత్తా చాటాలని ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సంకల్పిస్తోంది.